తెగదెంపులకే వైయస్ జగన్ మొగ్గు


పార్టీ అధిష్టానానికి కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు కొండా సురేఖ రాసిన లేఖ రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి కె. రోశయ్యపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ను బలపరుస్తూ ఆమె తీవ్రమైన వ్యాఖ్యలతో పార్టీ అధిష్టానానికి మంగళవారం లేఖ రాశారు. ఢిల్లీలో పార్టీ హైకమాండ్ తో జగన్ కు రాజీ కుదర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో సురేఖ తిరుగుబాటు జగన్ అంతరంగాన్ని పట్టిస్తోందని అంటున్నారు. జగన్ ఎటువంటి స్థితిలోనూ అధిష్టానంతో రాజీకి వచ్చేందుకు సిద్ధంగా లేరని, తెగదెంపులకే సిద్ధపడుతున్నారని అంచనా వేస్తున్నారు.

జగన్ ఆంతరంగికుల్లో కొండా సురేఖ ఒకరు. జగన్ కోసమే ఆమె మంత్రి పదవికి రాజీనామా చేశారు. జగన్ కు తెలియకుండా ఆమె అధిష్టానానికి లేఖ రాస్తారని ఊహించడానికి కూడా సాధ్యం కాదు. జగన్ సూచన మేరకే ఆమె తీవ్రమైన వ్యాఖ్యలతో లేఖ రాసినట్లు భావిస్తున్నారు. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి రోశయ్యకు ఇబ్బందులు కలిగిస్తూ స్థిరంగా పని చేసుకోవడానికి వీలు లేకుండా చేయడమే ప్రధానమై ఎత్తుగడగా జగన్ వ్యవహరిస్తున్నారని సురేఖ చర్యను బట్టి అర్థం చేసుకోవచ్చు.

అంబటి రాంబాబుపై చర్య తర్వాత జగన్ ఏ విధమైన ఎత్తుగడను అనుసరిస్తారనే ప్రశ్నకు కొండా సురేఖ విమర్శల ద్వారా సమాధానం దొరికినట్లేనని భావిస్తున్నారు. అధిష్టానం చర్యలకు భయపడేది లేదని చెప్పడానికి కూడా కొండా సురేఖ దాడిని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. వైయస్ ప్రథమ వర్ధంతి సెప్టెంబర్ 2వ తేదీ వరకు ఇదే విధమైన తిరుగుబాట్లతో సమస్యలు సృష్టించి, పార్టీ హైకమాండ్ చర్యలు తీసుకునేలా ముందుకు సాగాలని జగన్ వర్గం అనుకుంటోందని చెబుతున్నారు. తమంత తాము విడిపోయి పార్టీ పెడితే ఉండే ప్రభావం కన్నా హైకమాండ్ చర్యలను తప్పు పడుతూ బయటకు రావడానికి అనువైన వాతావరణాన్ని కల్పించుకోవాలనేది జగన్ ఎత్తుగడగా భావించవచ్చునని చెబుతున్నారు.
www.123tollywoodcinemalu.blogspot.com is not responsible for the accuracy, compliance, copyright, legality,decency, or any other aspect of the content of other linked sites.Sometimes we post the links from other sites that are on the Internet.