సెల్లులో సొల్లొద్దు
సెల్‌ఫోన్..
ఇప్పుడు ఓ నిత్యావసరం..
ఒకప్పుడు మనుషులను మనసు కలిపితే.. ఇప్పుడాపని చేస్తోంది మొబైల్‌ఫోన్..
ఎదురుగా ఉండి చెప్పలేని భావాలను తెలియచేయాలంటే మార్గం కూడా మొబైలే..
నచ్చిన వారికి నచ్చినప్పుడు కాల్ చేసుకోవచ్చు.. కావల్సినంత సేపు మాట్లాడుకోవచ్చు..
ఒకే దగ్గర ఉండి మాట్లాడాలనీ లేదు.. ఎక్కడికైనా వెళ్లూ మాట్లాడుకోవచ్చు..
నిలబడి మాట్లాడుకోవచ్చు..
కూర్చుని మాట్లాడుకోవచ్చు..
కావాలనుకుంటే.. నడి సముద్రంలోకి వెళ్లైనా మాట్లాడుకోవచ్చు..
సెల్‌ఫోన్ వచ్చిన తర్వాత మనిషి జీవితమే మారిపోయింది.
మనిషికి అడ్రస్ అయిపోయింది మొబైల్ నంబర్..
ఏ విషయం చెప్పాలన్నా.. సెల్‌కావాల్సిందే..
ఇక అప్పుడే ప్రేమలో పడ్డవారికి సెల్ అవసరం అంతా ఇంతా కాదు..
క్షణాలు.. నిమిషాలు.. దాటి గంటలు గంటలు కబుర్లాడుకునే జంటలు కోకొల్లలు..
కంపెనీలిచ్చే ఆఫర్ల పుణ్యమా అని సెల్‌వాడే వారి సంఖ్య పెరిగిపోయింది.
ఓ నిమిషం మాట్లాడుకునే వారు సైతం.. ఇప్పుడు కనీసం పదినిమిషాలు మాట్లాడందే కాల్ కట్ చేయడం లేదు.
చెప్పాలంటే సెల్లే లైఫ్ అయిపోయింది. ఒక్కరోజు సెల్‌ఫోన్ చేతిలో లేకపోతే.. ప్రాణంపోయినట్లే.
అయితే.. ఇక్కడే అందరినీ కలవరపెట్టే వాస్తవం బయటపడింది.
సెల్‌లేకపోతేనే కాదు.. సెల్‌ఉన్నా ప్రాణం పోవచ్చంటున్నారు పరిశోధకులు..
మీకు తెలియకుండానే మీ జీవితాన్ని ముంచేయబోతోంది సెల్‌ఫోన్.
రోజుకు మీరు పదినిమిషాలు మాట్లాడితే చాలు.. మీరు సెల్ ఉచ్చులో చిక్కుకున్నట్లే..
ఇంతకీ ఈ విషయం చెబుతోంది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు.. మిమ్మల్ని కంగారు పెట్టడానికి కాదు. మిమ్మల్ని అప్రమత్తం చేయడానికి.
సెల్లు సమస్యలు
మీకు ఉన్నట్టుండి వింతవింత శబ్దాలు వినిపిస్తున్నాయా?
మీ చెవిలో ఏదో శబ్దం మారుమోగుతోందా?
మీ చెవి వేడెక్కినట్లు అనిపిస్తోందా..?
ఇవన్నీ మీరు చేసిన ఓ పనివల్ల వచ్చినవే. అదే సెల్‌ఫోన్‌లో మాట్లాడడం.. మీరు నమ్మినా నమ్మకపోయినా.. అదే పచ్చినిజం. కేవలం సెల్‌ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడడం వల్ల మీరు వినికిడి సమస్యలను ఎదుర్కోనున్నారు..
పది దాటితే ప్రమాదమే
చెప్పాలంటే మనుషులుంతా మొబైల్ బానిసలుగా మారిపోతున్నారు. మొబైల్‌లేనిదే గడపలేని స్థితికి చేరుకుంటున్నారు. మొబైల్‌ను చెవులకు అతికించేసుకుని మిమ్మల్ని మీరు మరిచిపోవచ్చు. మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా మరిచిపోవచ్చు. కానీ అక్కడే ప్రమాదానికి బీజం పడుతోంది. సెల్‌ఫోన్ మీకు మేలు చేసే సంగతి అటుంచితే.. నష్టం చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు పరిశోధకులు. నాలుగేళ్లకన్నా ఎక్కువకాలంగా సెల్‌ఫోన్‌ను విపరీతంగా వాడితే.. చెవి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటీవల ఆస్ట్రియాలో జరిగిన ఓ పరిశోధన ఈ విషయాన్ని బయటపెట్టింది. రోజుకు పదినిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడేవారికి చెవి సమస్యలు ఎక్కువగా వస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది.
సెల్‌ఫోన్ మాట్లాడుతున్నప్పుడు విడుదలయ్యే సిగ్నల్స్ మీ చెవికి హాని చేస్తాయి. రెండు మూడు నిమిషాలంటే పర్వాలేదు గానీ.. ఏకధాటిగా మాట్లాడితే వీటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కొంతసేపటికే మీ ఫోన్ వెడెక్కుతుంది. ఆ తర్వాత చెవి వెడెక్కినట్లు అనిపిస్తుంది. ఈ అనుభవం మీకు కూడా ఎదురయ్యిందా..? కచ్చితంగా ఫేస్ చేసే ఉంటారు. కానీ.. మీరు సింపుల్‌గా మరో చెవిలో ఫోన్ పెట్టుకుని మాట్లాడేస్తుంటారు. అదే అత్యంత ప్రమాదకరం..
రోజుకు సగటున పదినిమిషాలకన్నా ఎక్కువగా మొబైల్‌ఫోన్లో మాట్లాడేవారిక దీర్ఘకాలిక సమస్యలు ఎదురయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. చెవిలో నిత్యం ఏదో శబ్దాలు మారుమోగుతున్నట్లు వినిపిస్తూనే ఉంటాయి. మీకు మనశ్సాంతి లేకుండా చేస్తాయి. ఇదంతా కేవలం సెల్‌ఫోన్‌ను చెవికి అతికించేసుకుని మరీ అతిగా మాట్లాడం వల్లే.
ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు
మీరు సెల్‌ఫోన్ ఎక్కువగా వాడతారా..?
రోజుకు 20 - 30 కాల్స్ చేస్తుంటారా?
ఎంత లేదన్నా రోజుకు ఓ అరగంట మాట్లాడతారా..?
అయితే.. మీకు బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ?
అతి తక్కువ కాలంలో మీ ప్రాణం పోవచ్చు..?
ఈ విషయం మేం చెబుతున్నది కాదు.. ఈ హెచ్చరిక చేస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ - W.H.O. సెల్‌ఫోన్ వల్ల వచ్చే సమస్యలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రావడంతో.. దాదాపు పదేళ్ల క్రితమే ఈ సమస్యపై దృష్టి పెట్టింది W.H.O. అప్పటినుంచి చేస్తున్న పరిశోధనల ఫలితాలు.. ఇప్పుడు విడుదలయ్యాయి. ఆ ఫలితాలే సెల్ వినియోగదారులను కలవరానికి గురిచేస్తున్నాయి.
రోజుకు అరగంట సెల్‌ఫోన్‌లో కబుర్లు చెప్పేవారికి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువని.. WHO రిపోర్ట్ చెబుతోంది. పైగా.. సెల్‌ఫోన్ వాడని వారితో పోల్చితే సెల్ వాడేవారికి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు మూడు రెట్లు ఎక్కువని రిపోర్ట్ పేర్కొంది. దాదాపు పదమూడు దేశాల్లో.. పదేళ్ల పాటు ఈ పరిశోధన సాగింది. 5 వేలమంది బ్రెయిన్ క్యాన్సర్ పేషెంట్స్‌పైనా, వారి సన్నిహితులపైనా పరిశోధన జరిగింది. వీరిలో ఎక్కువమందికి ఫోన్ ఎక్కువగా ఉపయోగించే చెవి వైపునే ట్యూమర్స్ ఏర్పడ్డాయి. దీన్నిబట్టి.. సెల్ వాడకం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలే ఎక్కువే అంటోంది WHO.
అయితే.. ఈ పరిశోధనలో పాల్గొన్న వారంతా 30 ఏళ్లపైబడినవారే. కానీ.. ఇప్పుడు సెల్‌ఫోన్లు ఎక్కువగా వాడుతోంది యువతరమే. పదిహేనేళ్లు కూడా నిండకుండానే.. గంటల కొద్దీ ఫోన్లలో కబుర్లు చెప్పేవారికి ప్రమాదం చాలా ఎక్కువ. పైగా.. సెల్‌ఫోన్ వాడకం వల్ల పెద్దవారికన్నా.. పిల్లల మెదడే రేడియేషన్‌కు ఎక్కువగా గురవుతుంది.
హెల్ సెల్
అనుకోకుండా తలనొప్పి రావడం.. రాత్రుళ్లు నిద్రపట్టకపోవడం.. నరాల సమస్య.. ఇలా ఒకదాని వెంట మరొకటి చుట్టుముడతాయి. దీనికి కారణం కేవలం మీరు ఉపయోగిస్తున్న సెల్‌ఫోన్. చివరకు.. సెక్స్‌సామర్థ్యాన్ని కూడా దెబ్బతీస్తాయి సెల్‌ఫోన్లు..
ఇక గర్భిణీలు సెల్‌ఫోన్‌కు ఎంత దూరంగా ఉంటే అంతమంచిది. సెల్ అతిగా వాడే స్త్రీలకు అబార్షన్లు ఎక్కువగా జరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. డాక్టర్లు కూడా వీలైనంతవరకూ గర్భిణీలు సెల్‌ఫోన్ వాడకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.
ఇక మానసిక సమస్యల ప్రభావం సెల్‌ఫోన్ల వాడకం వల్ల చాలా పెరుగుతోంది. సెల్ సంస్కృతి విస్తరించిన తర్వాత మానవ సంబంధాలు తగ్గుముఖం పట్టాయి. ఏ పనైనా సెల్ ద్వారానే జరుగుతోంది. మనిషీ, మనిషీ కలుసుకునే సమయం తగ్గిపోతోంది. ఇక చేతిలో సెల్ ఉంటే చుట్టూ ఉన్న ప్రపంచాన్నే మర్చిపోతున్నారు ఈ తరం యువతీయువకులు. సెల్ ద్వారా అనవసర పరిచయాలు పెంచుకుంటున్నారు. చివరకు జీవితాలనూ నాశనం చేసుకుంటున్నారు.
పరిష్కారమార్గం
సెల్ వాడకాన్ని తగ్గించడం కష్టమే.. పైగా.. రోజురోజుకూ సెల్‌ను వాడేవారి సంఖ్య పెరుగుతోందే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. అందుకే.. మొబైల్ వాడే విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే... ప్రాణానికే ప్రమాదం. ముఖ్యంగా.. సెల్‌ఫోన్‌ను చెవికి దగ్గరగా పెట్టి మాట్లాడడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. దానివల్లే సమస్యలు ఎక్కువవుతాయి.
ఇప్పటికే సమస్యలతో బాధపడుతున్నవారు సెల్‌ఫోన్‌లో వీలైనంత తక్కువ మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. భవిష్యత్తులో సమస్యలు రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సెల్‌లో సొల్లు కబుర్లు చెప్పుకోకుండా.. సింపుల్‌గా కాల్ ముగించాలి.
కంటిన్యూగా మాట్లాడడం అలవాటైన జనానికి.. ప్రతీసారి లోబ్యాటరీ వెక్కిరిస్తూ ఉంటుంది. అయినా సెల్లు బాబులు మాత్రం దాన్ని వదలిపెట్టారు. కానీ.. ఈ సమయంలోనే రేడియేషన్ చాలా ఎక్కువగా విడుదలవుతూ ఉంటుంది. కాబట్టి.. లో బ్యాటరీ వచ్చిందంటే.. సెల్లు చెల్లు చెప్పాలి. ఫుల్‌ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాతే మళ్లీ కాల్స్ అటెండ్ చేయాలి. అప్పుడే మీ చెవి సురక్షితంగా ఉంటుంది. మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. లేదంటే.. సెల్లు కారణంగా హాస్పిటల్ బిల్లు పెంచుకోవాల్సి ఉంటుంది.
www.123tollywoodcinemalu.blogspot.com is not responsible for the accuracy, compliance, copyright, legality,decency, or any other aspect of the content of other linked sites.Sometimes we post the links from other sites that are on the Internet.