ఛలో చందమామ





మీరో ఫోన్ చేస్తారు...
హలో.. కన్నా ఎలా ఉన్నావ్...
బాగానే ఉన్నానమ్మా.. (అటు నుంచి సమాధానం)

ప్రయాణం బాగా సాగిందా..
హ్యాపీగా అమ్మా.. ఇప్పుడే దిగాను..

అక్కడ వాతావరణం ఎలా ఉంది..
చాలా బాగుంది.. కాకపోతే మనకన్నా కాస్త చలి ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తోంది..
మనవాళ్లు ఎలా ఉన్నారు...
బాగున్నారు. నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు.

ఈ ప్రశ్నలన్నీ మన దేశం నుంచి మరో దేశానికి వెళ్లిన మీ అబ్బాయికి వేసేవి కాదు... మన భూమిపై నుంచి బయల్దేరి చందమామను చేరుకున్న వారిని అడిగేవి.
భూమిపై నుంచి దూసుకెళ్లే రాకెట్లు ఇకపై ఉపగ్రహాలను, వ్యోమగాలనే కాదు ... విమానాల్లా సాధారణ ప్రయాణీకులను కూడా మోసుకుపోతాయి. ప్రభుత్వ సంస్థలు మాత్రమే నిర్వహించే రాకెట్ ప్రయోగాలు.. ఇకపై ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వస్తుంది..మాన్సూన్ ఆఫర్, సమ్మర్ ఆఫర్ అంటూ టికెట్ ఛార్జీలపై డిస్కౌంట్లూ ఇవ్వొచ్చు.. అతి వేగంగా తీసుకెళ్లే సర్వీస్ మాదంటే మాదంటూ పోటాపోటీగా ప్రకటనలూ ఇవ్వొచ్చు..డైరెక్ట్ సర్వీస్లు కొన్నైతే.. భూమిని చుట్టూ చూపించి తీసుకెళ్లేవి మరికొన్ని కావచ్చు..ఇక ప్రయాణం సంగతి పక్కన పెట్టి చందమామపైకి చేరుకుందాం...

ఇంతవరకూ దుమ్మూదూళి, రాళ్లూ రప్పలు.. భారీగా కొండలు మాత్రమే ఉన్నాయనుకునే చందమామపై వందలాది రిసార్టులు రెడీ అవుతాయి. వేలాదిగా జనం జీవిస్తుంటారు. నిత్యం పనిచేసే మిషన్లతో అంతా సందడి సందడిగా ఉంటుంది..భూమి నుంచి వచ్చేవారు... భూమిపైకి వెళ్లేవారితో చందమామపై ఫ్లైట్ స్టేషన్లు బిజిబిజీగా ఉండొచ్చు. చెప్పాలంటే.. మన భూమికి జిరాక్స్ కాపీలా మారిపోతుంది చందమామ. మనిషికి ఆవాసమైపోతుంది. ప్రస్తుతం చెప్పుకోవడానికి ఒక్కరు కూడా లేని చందమామపై వేలాదిగా మనుషులు కనిపిస్తారు. ఇదంతా జరుగుతుందా అని ఏమాత్రం సందేహ పడకండి. త్వరలోనే ఈ సంఘటనలన్నీ మీ కళ్ల ముందే జరుగుతాయి. అంతా అనుకూలిస్తే.. మరో 50 ఏళ్లలోనే.. మనిషి జీవితం చందమామపై మొదలుకావచ్చు..

చందమామపై జీవనమా?

మనిషి జీవించాలంటే ఆక్సిజన్ కావాలి...
కానీ.. చంద్రుడిపై ఆక్సిజన్ లేదు..
మరి జీవించడం సాధ్యమవుతుందా..?
కచ్చితంగా సాధ్యమవుతుంది.

నీరు తాగకుండా మనిషి బతకలేడు ..
చందమామపై ప్రస్తుతం నీరు లేదు..
మరి పూర్తిస్థాయిలో అక్కడే ఉండగలరా....?
చెప్పాలంటే హాయిగా ఉండొచ్చు..

చంద్రుడిపై చిన్న మొక్క కూడా లేదు. మరి ఆహారం ఎలా?
వేలాది మందికి భూమిపై నుంచి ఆహారం సరఫరా చేయడం సాధ్యమవుతుందా..?
కచ్చితంగా సాధ్యం కాదు..
మరి చంద్రుడిపైకి చేరినవారి ఆకలితో చావాల్సిందేనా..
ఆ సమస్యే లేదు నిండు నూరేళ్లూ బతకొచ్చు..

చంద్రుడిపై గురుత్వాకర్షణ శక్తి భూమిపై ఉన్నట్లు ఉండదు..
స్పేస్ సూట్ ఉన్నా.. మాములుగా నడవడం సాధ్యం కాదు..
కానీ వేలాది మంది సాధారణ జీవితాన్ని చందమామపై గడపగలుగుతారా..
అదీ సాధ్యమే..

ఇన్ని సమస్యలు ఎలా తీరతాయి అని అనుకుంటున్నారా..? మరికొన్ని రోజుల్లో చంద్రుడి జాతకం మారిపోనుంది. చెప్పాలంటే.. మనిషే చంద్రుడి జాతకాన్ని మార్చేయనున్నాడు. మరో భూమిగా చంద్రుడిని మార్చబోతున్నాడు. అదికూడా అతి త్వరలోనే జరగబోతోంది. దీనికోసమే ఇప్పుడు అన్ని దేశాలూ చంద్రుడివైపు పరుగులు పెడుతున్నాయి.
చందమామ విషయంలో వచ్చే పదేళ్లే ఎంతో కీలకం. ఎంతోకాలం క్రితం ఆగిపోయిన చంద్రడి శోధన మళ్లీ మొదలయ్యింది. అమెరికా ... రష్యా.. జపాన్.. ఇండియా.. చైనా.. ఇలా ప్రతీ దేశమూ ఇప్పుడు చంద్రుడి మీదనే పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాయి. జాబిల్లి రహస్యాల గుట్టువిప్పడానికీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఎవరికివారే అన్నట్లు కాకుండా.. చంద్రుడిపై ఒక్కో పనిని ఒక్కే దేశం చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మూన్‌పైకి సెస్మిక్ డిటెక్టర్స్ ను రష్యా పంపిస్తుంది. భూకంపాలు ఎక్కడ రావచ్చో ముందుగానే గుర్తిస్తుంది. అంతేకాదు.. చంద్రుడి కేంద్రం నుంచి ఎంత వేడి వెలువడుతుందో కూడా కనిపెడుతుంది.
ఇక చంద్రుడిపై దొరికే అత్యంత అరుదైన ఖనిజ నిక్షేపాలను వెలికి తీసే పనిలో జపాన్ బిజీ అవుతుంది. చంద్రుడి ఉపరితలం మొత్తాన్ని స్కాన్ చేసే పనిలో మనదేశం తలమునకలవుతుంది. ఏ ప్రాంతంలో ఏముందో కెమెరాల్లో ఒడిసిపడుతుంది. చంద్రుడికి సంబంధించి సంపూర్ణ మ్యాప్ ను ఇస్రో తయారు చేస్తుంది. అమెరికా తన పనిని ఇప్పటికే మొదలుపెట్టేసింది. చంద్రుడిపై నీటిని తయారు చేయడం నాసా కర్తవ్యం. చందమామ ధృవాల్లో ఉన్న నీటిని ఎలా వెలికి తీయాలన్నది అమెరికన్ సైంటిస్టులు శోధిస్తారు. నీరు లభ్యమయ్యిందంటే.. మనుషులకు అవసరమైన ఆక్సిజన్ ను, రాకెట్లకు అవసరమయ్యే హైడ్రోజన్ ను తయారు చేయడం సులువే. నీటినుంచి హైడ్రోజన్, ఆక్సిజన్‌లను విడగొట్టడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే అయినప్పటికీ... భూమిపై నుంచి చంద్రుడిపైకి తీసుకువెళ్లడానికయ్యే ఖర్చుతో పోల్చితే, తక్కువే అవుతుంది.
ఇక స్పెషల్‌గా చంద్రుడిపై నివసించేవారికి ఆహారం అందించడానికీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవన్నీ సాధ్యమయ్యాయంటే మాత్రం.. చంద్రుడు కూడా మరో భూమిగా మారిపోతుంది. భూమిపై జీవించినట్లే.. చంద్రుడిపైనా మనిషి హాయిగా జీవించొచ్చు. ఏ మాత్రం కాస్త వీలు దొరికినా.. వెకేషన్‌కు చందమామను ఎంచుకోవచ్చు..

మానవ కాలనీలు


1969 జులై 20 ..
చంద్రుడిపై తొలిసారిగా మనిషి అడుగుపెట్టిన రోజు..
భూమిపైనుంచి మాత్రమే చూసే చంద్రుడిపై మనిషి సగర్వంగా నడిచిన రోజు..
ఇక చందమామపై హ్యూమన్ కాలనీలు వెలిసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ప్రపంచం పొంగిపోయిన రోజు..
కానీ.. ప్రపంచశక్తుల మధ్య ప్రచ్చన్నయుద్ధం ముగిసిపోవడంతో.. ఆ ప్రభావం చంద్రుడిపైనా పడింది. అగ్రరాజ్యాలు రెండూ చంద్రుడిని పక్కనపెట్టేశాయి. అంతటితో చంద్రుడి కథ ముగిసిపోయిందని అంతా భావించారు.. కానీ.. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ చంద్రుడివైపే ప్రపంచదేశాలన్నీ చూడాల్సి వస్తోంది. దీనికి కారణం.. ప్రపంచ శక్తులుగా ఎదుగుతున్న చైనా, భారత్‌లే. అవును.. చంద్రుడిపై చైనా ప్రయోగాలు చేస్తుండడంతో నాసాలో కలవరం కలిగింది. దీనికితోడు.. ఎంతో అమూల్యమైన హీలియం నిల్వలను చంద్రుడిపై ఉన్నాయని చైనా ప్రకటించడం అమెరికాను మళ్లీ చంద్రుడివైపు తొంగిచూసేలా చేసింది. ఇక చంద్రయాన్ ప్రయోగంతో చంద్రుడిపై నీటిజాడలను మనదేశం కనుక్కోవడంతో చంద్రుడిపై ప్రయోగాలు లాభసాటి వ్యవహారంగానే నాసాకు కనిపించింది. అందుకే.. బ్యాక్ టు మూన్ అంటూ తన అంతరిక్ష ప్రయోగాల దిశను చంద్రుడివైపు తిప్పేసింది. నీటిని అన్వేషించడానికి చంద్రుడిని తన రాకెట్తో ఢీకొట్టించింది.
అత్యంత శక్తివంతమైన రాకెట్ చంద్రుడిని ఢీకొట్టే సమయంలో వెలువడే పరమాణువులను పరీక్షించడానికి మరో ఉపగ్రహాన్ని మోహరించింది. ఈ ప్రయోగంపై ప్రపంచదేశాలు ఆక్షేపించినా .. సానుకూల ఫలితాన్నే సాధించింది నాసా. చంద్రుడిపై నీటిజాడలు ఉన్నాయని నిర్దారించుకొంది.
అసలు చంద్రుడిపై నీరు ఎందుకు ఉంది..? భూమిలానే చంద్రుడు ఏర్పడి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భారీగా అగ్నిపర్వతాలు పేలడమో.. భారీ ఉల్కలు ఢీకొట్టడం వల్లే ఈ నీరు మాయమై ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. లావాకారణంగా చంద్రుడి ఉపరితలమంతా రాళ్లతో నిండిపోయింది. ఈ రాళ్ల కిందనే నీటి నిక్షేపాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంతేకాదు.. ఇటీవల ప్రపంచ ప్రఖ్యాత జర్నల్- నేచర్- లో పేర్కొన్న వివరాల ప్రకారమూ చంద్రుడిపై నీటి జాడలు ఉన్నట్లు తెలుస్తోంది. 1971లో అమెరికా ప్రయోగించిన అపోలో 14 మిషన్ చంద్రుడిపై నుంచి తీసుకొచ్చిన నమూనాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు నీటి జాడను నిర్దారించారు.
చంద్రుడి ఉపరితలంపై హైడ్రాక్సైడ్లు చాలా పెద్దమొత్తంలో ఉన్నట్లు గుర్తించారు. హైడ్రాక్సైడ్ పరమాణు స్వరూపం HO. మన భూమిపై నీటి పరమాణుస్వరూపం H2O. అంటే.. నీటితో పోల్చితే.. ఒకే ఒక్క హైడ్రోజన్ పరమాణువు చంద్రుడిపై మిస్ అయ్యిందన్నమాట. ఈ ఒక్క హైడ్రోజన్ పరమాణువునూ చేర్చగలిగితే చంద్రుడిపై నీటిని సృష్టించవచ్చు. అయితే ప్రశ్నల్లా.. ఆ హైడ్రోజన్ పరమాణువును చేర్చగలమా లేదా అన్నదే..

చంద్రుడిపైనే ఎందుకు?


చంద్రుడిపై నుంచి అంతరిక్ష ప్రయోగాలను అతి తక్కువ ఖర్చుతో చేయొచ్చు. పైగా.. భూమిపైనుంచి ప్రయోగించే రాకెట్లకు చంద్రుడిపై ఫ్యూయల్‌ను అందించవచ్చు. అందుకే.. మన దేశం సహా.. అంతరిక్షంలో ప్రయోగాలు చేస్తున్న అన్ని దేశాలు ఇప్పుడు చంద్రుడిపైనే దృష్టిపెట్టాయి. అమెరికా అయితే.. ఈ సారి వెళ్లేది మళ్లీ వెనక్కి తిరిగిరావడానికి కాదంటోంది. అంటే.. చంద్రుడిపైనే ప్రయోగశాలను ఏర్పాటు చేయాలన్నది నాసా లక్ష్యం. అయితే.. చంద్రుడిపై ముందుగా నీటిని వెలికితీస్తే తప్ప ప్రయోగాల్లో ముందడుగు పడదన్న అభిప్రాయంలో శాస్త్రవేత్తలున్నారు. అందుకే.. నీటిని తయారు చేయడంపై దృష్టిపెట్టారు. చంద్రుడిపై ల్యాబ్‌ల ఏర్పాటుకు.. నీటి ఉత్పత్తికీ సంబంధం ఏమిటనుకుంటున్నారా..? సాధారణంగా ఇద్దరుముగ్గురు సైటింస్టులకు అవసరమైన నీటిని భూమిపై నుంచి తీసుకువెళ్లడం సాధ్యమవుతుంది కానీ.. ఒకేసారి ఎక్కువ మందికి అవసరమైన నీటిని తీసుకువెళ్లలేం. పైగా.. కేవలం అరలీటరు నీటిని భూమిపైనుంచి చంద్రుడిపైకి చేర్చాలంటే దాదాపు 15 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. అందుకే.. చంద్రుడిపైనే నీటిని ఉత్పత్తి చేయాలన్నది శాస్త్రవేత్తల ప్లాన్. అంతేకాదు.. హైడ్రాక్సైడ్ల నుంచి నీటితో పాటు.. మనిషి పీల్చుకోవడానికి అవసరమైన ఆక్సిజన్... రాకెట్లు.. యంత్రాలు నడవడానికి అవసరమైన హైడ్రోజన్‌ను కూడా ఉత్పత్తి చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇవి సాధ్యమైతే.. చంద్రుడిపై నివసించడానికి మనిషికున్న అడ్డంకులు సమూలంగా తొలిగిపోతాయి.
చంద్రుడి ఉపరితలంపై ఉన్న మట్టిలో ఎక్కువగా మెటలాక్సైడ్‌లు ఉండడంవల్లే నీటిని తయారు చేయగలమన్ననమ్మకం శాస్త్రవేత్తలకు కలిగింది. దీనికి తగ్గట్లుగానే... చంద్రుడి మట్టి నుంచే నీటిని తయారు చేయవచ్చని నిరూపిస్తున్నాడు అమెరికాకు చెందిన లారీ క్లార్స్. చంద్రుడిపై ఎంతోకాలంగా పరిశోధనలు చేస్తున్న ఆయన.. ఈ విషయంలో ముందడుగు వేశాడు.
అపోలో శాంపిల్స్ ఆధారంగా చంద్రుడి మట్టిని కృత్రింగా లారీక్లార్క్ తయారు చేశాడు. ఈ మట్టిని ఓ ఫర్నిస్‌లో పెట్టి వేడి చేశాడు.. క్లార్క్ లక్ష్యం ఒక్కటే.... ఎలాగైనా ఆ మట్టి నుంచి నీటిని తీయడం. టెంపరేచర్ 800 డిగ్రీ సెంటిగ్రేడ్‌కు చేరిన తర్వాత... ఓ మ్యాజిక్ జరిగింది. ఫర్నిస్ నుంచి నీటి ఆవిరి వెలువడడం మొదలయ్యింది.. క్రమంగా నీరు ఏర్పడింది. అదీ అత్యంత శుద్ధమైన నీరు.. ఇదే శాస్త్రవేత్తలకు కావాల్సింది. ఒక్కసారి నీరు తయారయ్యిందంటే.. చంద్రుడి స్వరూపమే మారిపోతుంది. దుమ్మూ దూళితో కూడీన నేలపై నీటి పరవళ్లు మొదలవుతాయి. మొక్కలు మొలుస్తాయి.. చెప్పాలంటే.. భూమి ఉపగ్రహం కాస్తా.. మరో భూమిగా మారుతుంది.

సౌత్‌పోలే టార్గెట్‌
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్... అంతరిక్షంలోనే ఉంటూ ప్రయోగాలు చేయడానికి ఇప్పుడున్న ఏకైక వేదిక. కానీ.. స్పేస్‌స్టేషన్ నిర్వహణ చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అదే చందమామపై స్టేషన్‌ను ఏర్పాటు చేసుకుంటే చాలా ఖర్చు తగ్గించుకోవచ్చు. పైగా చంద్రుడిపై ఉన్న వనరులనూ వాడుకోవచ్చు. చందమామపై వాతావరణం.. భూమికున్న రక్షణకవచంలాంటివి లేకపోయినా.. సగభాగం ఎప్పుడూ చీకటిగా ఉంటుంది. సూర్యకిరణాలు ఏమాత్రం ఈ వైపు పడవు. నీటి నిల్వలు కూడా అక్కడే ఎక్కువగా ఉన్నట్లు అంచనా. చంద్రుడిని మ్యాపింగ్ చేస్తున్నప్పుడూ సౌత్‌పోల్ ప్రాంతమే కాస్త సేఫ్ ఏరియాగా తేలింది. మరో పదేళ్లలో ఈ ప్రాంతానికి వ్యోమగాములు వెళ్లి.. పరిశోధనలు మొదలుపెడతారు. ఇంతకుముందులా కాకుండా ఈ సారి రోజుల తరబడి ఉంటారు.
అయితే.. వాతావరణం లేకపోవడం వల్ల నివాసాలు ఏర్పాటు చేసుకోవడం కష్టమన్న అభిప్రాయాన్ని కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఉల్కల తాకిడిని తట్టుకునేలా నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది. మొత్తంమీద చూస్తే.. మనిషి చంద్రుడిపైకి వెళ్లి నివసించడం కష్టమేమోగానీ.. అసాధ్యం మాత్రం కాదు. పైగా.. మనిషిని అక్కడికి తీసుకువెళ్లాలన్నదే శాస్త్రవేత్తల ప్రయత్నం. త్వరలోనే ఆ ప్రయత్నం ఫలించాలని ఆశిద్దాం.